: హీరో కాని ‘రియల్’ హీరో...అన్నదాత పిల్లల్ని అక్కున చేర్చుకున్న ‘పిరమల్’ అధినేత
దేశానికి వెన్నెముక వ్యవసాయమే. పొలాల్లో సాగు చేస్తూ దేశ ప్రజలకు అన్నం పెడుతున్న రైతులు నిజంగా అన్నదాతలే. అయితే సాగులో నష్టాలు అన్నదాతలను బలవన్మరణం బాట పట్టిస్తున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్... వ్యవసాయం ప్రధానాధారమైన అన్ని రాష్ట్రాల్లోనూ రైతుల ఆత్మహత్యలు లెక్కలేనన్ని జరుగుతున్నాయి. అయితే సాగును లాభసాటిగా మార్చి అన్నదాతల ఆత్మహత్యలను నివారించే దిశగా చర్యలు తీసుకోవాల్సిన ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయి. ఈ క్రమంలో ఏ ఒక్కరిపైనో భారం వేయకుండా బాలీవుడ్ హీరోలు నానా పటేకర్, అక్షయ్ కుమార్ లు తమ వంతుగా అన్నదాతలను ఆదుకుంటున్నారు. తద్వారా సిల్వర్ స్క్రీన్ పైనే కాదు ‘రియల్’ లైఫ్ లోనూ తాము హీరోలమేనని వారు నిరూపించుకున్నారు. తాజాగా పారిశ్రామిక రంగంలో ఊపిరిసలపని వ్యవహారాలతో నిత్యం బిజీబిజీగా ఉండే పిరమల్ గ్రూప్ అధినేత హరిందర్ సిక్కా రైతు ఆత్మహత్యలపై ప్రచురితమవుతున్న వరుస వార్తా కథనాలను చూసి చలించిపోయారు. తన వ్యవహారాలన్నింటిని కాస్త పక్కనపెట్టి మెదక్ జిల్లాకు వచ్చారు. జిల్లాలోని తెలంగాణ సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్ పరిధిలోని జగదేవపూర్ మండలం అన్నసాగర్ లో ఇటీవల సాగు అప్పులతో బాల్ నర్సయ్య అనే రైతు భార్యతో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో వారి ఇద్దరు పిల్లలు నవీన్, వినోదలు అనాథలయ్యారు. ఈ పిల్లలిద్దరితో పాటు వారు చదువుతున్న పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న మరో విద్యార్థి స్వామిని హరిందర్ సిక్కా అక్కున చేర్చుకున్నారు. ఈ ముగ్గురు పిల్లలు జీవితంలో స్థిరపడే వరకూ తనదే బాధ్యత అని ఆయన ప్రకటించారు.