: ప్రయాణికులను ‘రన్ వే’పై నిలబెట్టిన ‘చెర్రీ’ ఫ్లైట్...చివరకు టికెట్ డబ్బులను తిరిగిచ్చేసిన ‘ట్రూజెట్’
టాలీవుడ్ యంగ్ హీరో రాంచరణ్ తేజ్ భాగస్వామ్యంలో ఆకాశయానం మొదలెట్టిన ట్రూజెట్ (టర్బో మేఘా ఎయిర్ వేస్) విమానం ఒకటి ప్రయాణికులను నిన్న ఉదయం నుంచి రాత్రి దాకా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పడిగాపులు పడేలా చేసింది. ఉదయం 8 గంటలకు హైదరాబాదు నుంచి తిరుపతి బయలుదేరాల్సిన ట్రూజెట్ విమానం సాయంత్రం 6 గంటలకు గాని బయలుదేరలేదు. ట్రూజెట్ లో ప్రయాణం కోసం టికెట్లు కొనుగోలు చేసిన ప్రయాణికులు నిన్న ఉదయమే శంషాబాదు ఎయిర్ పోర్టు చేరుకున్నారు. అయితే, ఎంతకీ విమానం జాడ లేదు. దీంతో ప్రయాణికులు ఆందోళనకు దిగేలోగానే రంగప్రవేశం చేసిన టర్బో మేఘా ఎయిర్ వేస్ అధికారులు అనివార్య కారణాల వల్ల విమానాన్ని 6 గంటలకు ఏర్పాటు చేస్తామని చెప్పారు. కొత్త విమానయాన సంస్థ కదా, సరేలే అనుకుంటూ ప్రయాణికులు సర్దుకుపోయారు. తీరా సాయంత్రం 6.30 గంటలకు వచ్చిన విమానం ప్రయాణికులను తీసుకుని తిరుపతికి బయలుదేరి, మరి కాసేపటికే తిరిగి శంషాబాదుకు చేరుకుంది. దీంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రన్ వేపైనే ఆందోళనకు దిగారు. తిరుపతిలో వాతావరణం అనుకూలించని కారణంగానే తిరిగి శంషాబాదు రావాల్సి వచ్చిందని చెప్పిన టర్బో ఎయిర్ వేస్ అధికారులు టికెట్ డబ్బులను తిరిగిచ్చేశారు. దీంతో వేరే విమానాల్లో ప్రయాణికులు తమ గమ్యస్ధానాలకు బయలుదేరారు.