: మ్యాచ్ కు అంతరాయం కలిగించొద్దు... హార్దిక్ పటేల్ కు సౌరాష్ట్ర క్రికెట్ సంఘం అభ్యర్థన
గుజరాత్ పటేల్ సామాజిక వర్గానికి రిజర్వేషన్ల కోసం ఆందోళన బాట పట్టిన పటిదార్ అనామత్ ఆందోళన్ సమితి నేత హార్దిక్ పటేల్ నిరసనకు అవకాశం ఉన్న ఏ ఒక్క విషయాన్ని వదిలిపెట్టడం లేదు. ఫ్రీడమ్ సిరీస్ లో భాగంగా ఈ నెల 18న రాజ్ కోట్ లో భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య వన్డే మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ టికెట్లను వీలయినన్ని కొనుగోలు చేసి స్టేడియంలోకి వెళ్లి ఆందోళనకు దిగాలని తన అనుయాయులకు హార్దిక్ పిలుపునిచ్చారు. విషయం తెలుసుకున్న సౌరాష్ట్ర క్రికెట్ సంఘం ఆందోళనను నివారించేందుకు రంగంలోకి దిగింది. ప్రపంచవ్యాప్తంగా ప్రసారం కానున్న ఈ మ్యాచ్ ప్రశాంత వాతావరణంలో జరగాలని కోరుకుంటున్నట్లు సంఘం గౌరవ కార్యదర్శి నిరంజన్ షా నిన్నటి మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. ఈ మ్యాచ్ సందర్భంగా ఎలాంటి ఆందోళనకు దిగొద్దని హార్దిక్ పటేల్, ఆయన అనుచరులకు షా విజ్ఞప్తి చేశారు.