: నలుగురు చేస్తేనే సామూహిక అత్యాచారమట... నోరు పారేసుకున్న కర్ణాటక హోం మంత్రి
కర్ణాటక హోంశాఖ మంత్రి కేజే జార్జ్ మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే బెంగళూరులో వరుసగా వెలుగుచూస్తున్న అత్యాచారాలతో సిద్ధరామయ్య సర్కారుపై విమర్శల జడివాడ కురుస్తోంది. తాజాగా ఈ విమర్శలకు మరింత ఆజ్యం పోసేలా జార్జ్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇద్దరు వ్యక్తులు ఓ మహిళపై చేసిన అత్యాచారాన్ని సామూహిక అత్యాచారం అనరని ఆయన అన్నారు. ముగ్గురు లేదా నలుగురు అంతకంటే ఎక్కువ మంది అత్యాచారం చేస్తేనే దానిని సామూహిక అత్యాచారం అంటారని ఆయన కొత్త భాష్యం చెప్పారు. రెండు రోజుల క్రితం బెంగళూరులో ఓ బీపీఓ ఉద్యోగినిపై ఇద్దరు వ్యక్తులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. దీనిపై నిన్న పోలీసులతో సమీక్ష నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఈ మేరకు నోరు పారేసుకున్నారు. అయినా బెంగళూరులో మహిళలపై అఘాయిత్యాల నివారణకు తాము అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పిన జార్జ్, ఆయా కంపెనీలు కూడా తమ ఉద్యోగులకు రక్షణ కల్పించాల్సి ఉంటుందని సెలవిచ్చారు.