: శంకుస్థాపన ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని గుంటూరు జిల్లా కలెక్టర్ ఆదేశం
గుంటూరులో రాజధాని శంకుస్థాపన ఏర్పాట్లపై ఆ జిల్లా కలెక్టర్ కాంతి లాల్ దండే ఉదయం సమీక్ష నిర్వహించారు. జిల్లా అధికారులు హాజరైన ఈ సమావేశంలో, రాజధాని శంకుస్థాపన కోసం శాఖలవారీగా కమిటీలు ఏర్పాటు చేశారు. విదేశాల నుంచి అతిథులు వస్తున్నందున ఏర్పాట్లు పక్కాగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. దేశ ప్రధానికి ఎలాంటి మర్యాద చేస్తారో, సామాన్య ప్రజానీకానికి కూడా అదే స్థాయిలో మర్యాదలు చేయాలని చెప్పారు. అందరూ సమన్వయంతో పనిచేసి జిల్లాకు మంచిపేరు తీసుకురావాలని అధికారులను కలెక్టర్ కోరారు. తరువాత కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ, ఈ నెల 22న ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు శంకుస్థాపన కార్యక్రమం జరుగుతుందన్నారు. అదే రోజు మధ్యాహ్నం 12 గంటల సమయంలో ప్రధాని వస్తారని, 12.35 నుంచి 12.45 వరకు పూజ, శంకుస్థాపన జరుగుతుందని వివరించారు. కార్యక్రమానికి 10 రాష్ట్రాల సీఎంలు, స్పీకర్లు, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు హాజరవుతారని తెలిపారు. జపాన్, సింగపూర్ ప్రతినిధులు సహా ఇతర దేశాల దౌత్యవేత్తలు కూడా వస్తారని కలెక్టర్ చెప్పారు. కార్యక్రమంలో సమన్వయం కోసం 250 మంది అధికారులను ఎంపిక చేస్తున్నామన్నారు.