: కొంత నయం... మక్కా తొక్కిసలాటకు కూడా 'మోదీ'నే కారణమనలేదు: గడ్కరీ ఎద్దేవా


బీహారులో ఎన్నికల సందర్భంగా రాజకీయ వేడి, నేతల ప్రత్యారోపణలు అధికమయ్యాయి. దాద్రిలో ముస్లిం మతస్తుడిని పశుమాంసం తిన్నాడన్న ఆరోపణలపై కొట్టి చంపిన ఘటన వెనుక మోదీ నేతృత్వంలో నడుస్తున్న హిందూ అతివాద శక్తుల హస్తం ఉందని కొందరు చేస్తున్న ఆరోపణలను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తీవ్రంగా ఆక్షేపించారు. "కొంత నయం. మక్కాలో తొక్కిసలాటకూ మోదీయే కారణమని వారు ఆరోపించలేదు" అని ఆయన ఎద్దేవా చేశారు. దాద్రిలో జరిగిన వ్యవహారంలో మోదీ స్పందించడానికి ఏమీ లేదన్న ఆయన "ఆయన మాట్లాడితే, ఎందుకు మాట్లాడారని అంటారు. మాట్లాడకుంటే ఎందుకు మాట్లాడలేదంటారు. ఆయన ఇంకేం చేయాలి?" అని ప్రశ్నించారు. ఈ ఘటన రాజకీయ పరమైంది కాదని, మీడియాలోని ఓ వర్గం కావాలనే ఈ ఘటనను పెంచుతోందని ఆయన ఆరోపించారు. 1947లో ఇండియాకు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి చిన్న చిన్న గొడవలు చాలా ప్రాంతాల్లో జరుగుతూనే ఉన్నాయని, ఇది దురదృష్టకరమని, వీటిని నివారించాల్సిన అవసరం ఉందని అన్న ఆయన, చట్టం తన పని తాను చేసుకుపోతుందని తెలిపారు. ఇకనైనా రాజకీయాలు మాని అభివృద్ధిపై దృష్టిని సారించాలని సలహా ఇచ్చారు.

  • Loading...

More Telugu News