: 10 లక్షల ఉద్యోగాలు పిలుస్తున్నాయ్: ఎన్ఎస్డీసీ


భారత బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా రంగాల్లో 10 లక్షలకు పైగా కొత్త ఉద్యోగాలు రానున్నాయని నేషనల్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎస్డీసీ) ఎండీ దిలీప్ చినాయ్ వ్యాఖ్యానించారు. కేపీఎంజీతో కలసి బీఎఫ్ఎస్ఐ (బ్యాంకింగ్, ఫైనాన్సియల్ సర్వీసెస్ అండ్ ఇన్స్యూరెన్స్) రంగంపై జరిపిన అధ్యయనం వివరాలను ఆయన వెల్లడించారు. 2017 నుంచి 2022 మధ్య మొత్తం 10.10 లక్షల మంది ఈ రంగానికి అవసరమని ఆయన అన్నారు. "ఇండియాలో ఇప్పటికింకా గ్రామీణ ప్రాంతాల్లో పూర్తి స్థాయి బ్యాంకింగ్, బీమా సేవల విస్తరణ జరగలేదు. ఇప్పటికీ దేశంలో 4 లక్షలకు పైగా గ్రామాల్లో ఒక్క బ్యాంకు కూడా లేదు. ఇక నాన్ బ్యాంకింగ్ విభాగానికి వస్తే, మధ్యతరహా పట్టణాల్లో సైతం సగటు సేవలు లభించడం లేదు. అందువల్లే ఈ రంగంలోని కంపెనీలకు మరిన్ని విస్తరణ అవకాశాలున్నాయి. అదే కొత్త ఉద్యోగాలను సృష్టించనుంది" అని దిలీప్ వివరించారు. కాగా, ఇటీవల గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవలే లక్ష్యంగా బంధన్ బ్యాంకు కార్యకలాపాలు ప్రారంభం కాగా, కొత్తగా బ్యాంకు సేవలను అందించేలా కొన్ని కంపెనీలకు ఆర్బీఐ అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. వీటిల్లో రెండు రకాలుంటాయి. అవి పేమెంట్ బ్యాంకులు, చిన్న బ్యాంకులు. పేమెంట్ బ్యాంకులు డిపాజిట్లను స్వీకరించవచ్చుగానీ, రుణాలిచ్చే వీలుండదు. ఇక చిన్న బ్యాంకులు డిపాజిట్లను స్వీకరించడంతో పాటు చిన్న, మధ్యతరహా వ్యాపారులకు, రైతులకు రుణాలను ఇవ్వొచ్చు. లైసెన్సులు పొందిన కంపెనీలన్నీ విస్తరణ బాటలో పడితే లక్షలాది మందికి ఉపాధి లభించనుంది. ఈ బ్యాంకుల్లో మేనేజర్ల నుంచి సిబ్బంది వరకూ ఎంతలేదన్నా ఒక్కో శాఖకు కనీసం 5 నుంచి 10 మంది వరకూ అవసరమవుతారు. వీరికి వేతనాలు సైతం సంతృప్తికరంగానే ఉంటాయి. వీటితో పాటు మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ ఎక్స్ఛేంజ్ ల్లో సైతం భారీగా ఉద్యోగావకాశాలు దగ్గర కానున్నాయని ఈ అధ్యయనం అభిప్రాయపడింది.

  • Loading...

More Telugu News