: అమరావతి శంకుస్థాపన ఆహ్వాన పత్రం సిద్ధం... ఎలా ఉంటుందంటే!
నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి నగర శంకుస్థాపన కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా జరపాలని నిర్ణయించిన ఏపీ సర్కారు ఆహ్వాన పత్రం ఎలా ఉండాలన్న విషయాన్ని ఖరారు చేసింది. "ప్రధాని చేతుల మీదుగా జరిగే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం" అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆహ్వానిస్తున్నట్టు ఇది ఉంటుంది. రాజధాని నగర మ్యాప్, బౌద్ధస్థూపంలోని చక్రం రెండూ ఉంటాయి. ఆ చక్రం దిగువన ఇది 2 వేల సంవత్సరాల క్రితం నాటిదని కూడా ప్రస్తావించారు. ఆపై శంకుస్థాపన సందర్భంగా జరిగే ఉత్సవాలు, సాంస్కృతిక కార్యక్రమాల వివరాలు, సమయాలు, వాహనాల పాస్ లను ఆహ్వాన పత్రికలతో పాటు సిద్ధం చేశారు. మొత్తం 10 రకాల డిజైన్లను తయారు చేయగా, వీటిని పరిశీలించిన చంద్రబాబు అత్యుత్తమమని భావించిన కార్డును ఎంపిక చేశారు. ఆపై దీన్ని ఈవెంట్ మేనేజ్ మెంట్ సంస్థ విజ్ క్రాఫ్ట్ కు పంపారు. ఇవి ముద్రితం కాగానే, రాజధానికి భూములిచ్చిన రైతులకు పంచే బాధ్యతలను ఎమ్మార్వోలకు అప్పగించి, కలెక్టర్లు పర్యవేక్షించనున్నారు.