: తెలంగాణ నామినేటెడ్ పదవుల జాతరకు రంగం సిద్ధం
టీఆర్ఎస్ నేతలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం వచ్చేసింది. నామినేటెడ్ పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది. దసరా పండుగలోపే నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. నామినేటెడ్ పోస్టుల ఆశావహుల జాబితాను ఇవ్వాలని ఎమ్మెల్యేలను సీఎం ఆదేశించారు. 17 కార్పొరేషన్ చైర్మన్ పదవులను త్వరలోనే భర్తీ చేస్తామని... అందులో ఐదు పదవులను ఎమ్మెల్యేలకు ఇస్తామని కేసీఆర్ చెప్పారు. దసరా నుంచి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం మొదలు పెడతామని తెలిపారు. టీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశంలో మాట్లాడుతూ, కేసీఆర్ ఈ విషయాలను వెల్లడించారు. ఏ క్షణంలోనైనా వరంగల్, నారాయణఖేడ్ ఉపఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడవచ్చని... అందువల్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని పార్టీ శ్రేణులకు కేసీఆర్ సూచించారు. ప్రభుత్వం చేసిన పనులను ప్రజలకు వివరిస్తే, ఎన్నికల్లో గెలుపు ఖాయమని చెప్పారు. జనవరిలో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని తెలిపారు.