: తెలంగాణలో కృష్ణా పుష్కరాలకు ఏర్పాట్లు
2016లో తెలంగాణలో జరగనున్న కృష్ణా పుష్కరాలను కట్టుదిట్టంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామని దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ రామచంద్రరావు చెప్పారు. దామరచర్ల మండలంలోని వాడపల్లి, అడవిదేవులపల్లి, ఇర్కిగూడెం గ్రామాల్లో ఆయన పర్యటించారు. ముఖ్యంగా అక్కడి ఆలయాలను, కృష్ణా తీరాలను సందర్శించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఇక్కడ జరగనున్న మొట్టమొదటి కృష్ణా పుష్కరాలను వైభవోపేతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టనుందన్నారు. ఈ నేపథ్యంలో ముందస్తు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. ఆలయాలకు రంగులు వేయడం, చలువపందిళ్ల ఏర్పాటు, విద్యుద్దీకరణకు ముందస్తు ప్రణాళికల రూపకల్పన నేపథ్యంలో పరిశీలించామన్నారు. గత పుష్కరాలకు నిర్మించిన పుష్కర ఘాట్లను పరిశీలించారు. దామరచర్ల మండలంలోని ఇర్కిగూడెంలో కొత్తగా పుష్కర ఏర్పాట్లు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రామచందర్ రావు తెలిపారు.