: నామినేషన్ వేసేందుకు దున్నపోతుపై వచ్చిన అభ్యర్థి!
ప్రజల ఓట్లను పొందేందుకు మన నేతలు ఎటువంటి వేషాలు వేస్తుంటారో అందరికీ తెలిసిందే. తాజాగా బీహారులో ఎన్నికల వేళ నామినేషన్ వేసేందుకు ఓ అభ్యర్థి దున్నపోతు ఎక్కి ఊరేగింపుగా వచ్చాడు. కలెక్టరేట్ వద్దకు వచ్చేసరికి అక్కడున్న జనాలను చూసి ఆ దున్నపోతు బెదిరిపోయింది. పరుగు లంఘించుకుంది. స్వతంత్ర అభ్యర్థిగా పోటీపడుతున్న మనోజ్ యాదవ్, మెడలో బంతిపూల మాలలు, తెల్లటి దుస్తులు ధరించి దున్నపోతుపై దర్జాగా వచ్చారు. అది బెదరడంతో ఒడుపుగా దిగి కిందపడకుండా తప్పించుకున్నారు. ఆపై నామినేషన్ వేసి వెళ్లిపోయారు. ఈ ఘటనను చూసి అక్కడున్న వారంతా "ఆయనకు దున్నపోతులపై ఊరేగడం అలవాటేమో, అందుకే తప్పించుకున్నారు" అని నవ్వుకోవడం కనిపించింది.