: రూ. 33 కోట్లతో సినిమా తీసి రూ. 500 కోట్లు కొల్లగొట్టిన శ్యామలన్
నైట్ శ్యామలన్... భారత సినీ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. చిన్నప్పుడే అమెరికాకు వెళ్లి, అక్కడే స్థిరపడిపోయి హాలీవుడ్ లో దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఆయన తాజా చిత్రం 'ది విజిట్' ప్రస్తుతం సంచలనం సృష్టిస్తోంది. కేవలం రూ. 33 కోట్లతో తీసిన ఈ సినిమా గత నెల 11న విడుదల కాగా, ఇప్పటివరకూ రూ. 500 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ సినిమా ఇంకా ఇండియా సహా పలు దేశాల్లో విడుదల కాలేదు. పేరున్న ఆర్టిస్టులు ఎవరూ లేకుండా, గ్రాఫిక్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లేకుండా నిశ్శబ్దంగా ఆయన తీసిన ఓ చిన్న హారర్ సినిమా ఇది. హారర్ సినిమాలకు ప్రధానంగా నేపథ్య సంగీతం ఆధారమన్న వాదనను ఈ చిత్రం తప్పని నిరూపించింది. తలుపు చప్పుళ్ల నుంచి అడుగుల శబ్దాల వరకూ అన్నీ లొకేషన్ లోనే రికార్డు చేసిన సినిమా కేవలం 30 రోజుల్లో పూర్తి కావడం విశేషం. అంతకుముందు ఆఫ్టర్ ఎర్త్, ది లాస్ట్ ఎయిర్ బెండర్, సైన్స్, ది విలేజ్ వంటి చిత్రాలు తీసి విఫలమైన శ్యామలన్ "ఆయన పని ఇక అయిపోయింది" అన్న విమర్శలకు ఎదురొడ్డి తన సత్తాను మరోసారి నిరూపించారు.