: ఆ ఇద్దరు తల్లులకూ ఒకే సమస్య... వేల మందికి స్ఫూర్తినిస్తున్న పరిష్కార మార్గం... మీరూ చూడండి!
అమ్మ చేతి వంట రుచి మరెవరికీ రాదు. తల్లి చూసుకున్నంతగా మరెవరూ చూసుకోలేరు. అదే తల్లిని విడిచి దూరంగా ఉండాలంటే... మనసెంతో బాధపడుతుంది. బిడ్డను విడిచి ఉండలేని తల్లి, తల్లికి దూరంగా తప్పనిసరి పరిస్థితుల్లో ఉండాల్సిన బిడ్డ ఎంతో మానసిక వేదన అనుభవిస్తారు. ఇక అదే ఊరుకాని ఊరిలో, భాష తెలియని చోట ఉండాలంటే మరింత ఇబ్బంది. ఇదే సమస్యతో బాధపడుతున్న ఇద్దరు తల్లులు తమ సమస్యను పరిష్కరించుకున్న తీరు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో మరెంతో మందికి స్ఫూర్తిగా నిలిచింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, రాజస్థాన్ లోని జోధ్ పూర్ కు చెందిన వివేక్ బీటెక్ డిగ్రీ కోసం చెన్నై వెళ్లాల్సి వచ్చింది. ఇదే సమయంలో సంతోష్ అనే చెన్నై విద్యార్థి జోధ్ పూర్ లోని ఐఐటీలో విద్యాభ్యాసం కోసం వెళ్లాడు. వీరిద్దరి తల్లుల పేర్లు మంజు, ఐశ్వర్య. ఇద్దరు తల్లులకూ తమ కుమారులు ఎలా తింటారు? ఎక్కడ ఉంటారు? అన్నది ప్రధాన దిగులు. తమిళ హాస్టళ్లలో ఉన్న ఆహారం రాజస్థాన్ వాసులకు నచ్చదు. రాజస్థాన్ హాస్టళ్ల ఫుడ్ ను తమిళులు తినలేరు. ఆ సమయంలో ఇద్దరు తల్లులనూ కలిపింది 'ఫార్చ్యూన్ మదర్ ఎక్స్ఛేంజ్'. ఇదో ఆన్ లైన్ ప్రోగ్రామ్. వీరిద్దరి మనసులూ కలిశాయి. విద్యాభ్యాసం పూర్తయ్యే వరకూ ఒకరి బిడ్డకు మరొకరు తల్లిగా ఉండటానికి ఒప్పందం కుదిరింది. అంతవరకూ బాగానే వుంది. ఆహారం విషయం సంగతేంటి? అదే ప్రధాన సమస్యగా మారింది. ఇక ఇద్దరు తల్లులూ తమ మెదడుకు పనిపెట్టారు. ఒకరి వంటకాలను మరొకరు నేర్చుకున్నారు. అందుకు ఎన్నో పాట్లు పడ్డారు. బిడ్డలకు నచ్చిన ఆహారాన్ని వండి పెట్టడానికి వారు పడిన శ్రమ అంతా ఇప్పుడు వీడియో రూపంలో బయటకు వచ్చింది. ఈ వీడియోను దాదాపు 4 లక్షల మంది వీక్షించి, ఇద్దరు తల్లుల సరికొత్త ప్రయత్నానికి అభినందనలు చెబుతున్నారు. ఆ వీడియోను మీరూ చూడండి.