: సూటు బూటులో వెంకయ్య... స్టయిల్ మార్చిన కేంద్ర మంత్రి
బీజేపీ సీనియర్ నేత, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు స్టయిల్ మార్చారు. నిన్నటిదాకా దేశ రాజధాని ఢిల్లీలోనే కాక ఎక్కడికెళ్లినా, అచ్చమైన పంచెకట్టుతో కనిపించేవారు. తెల్లటి పంచె, అదే రంగులో చొక్కాతో ఆయన తెలుగుదనానికి నిలువెత్తు నిదర్శనం. ఎప్పుడో విదేశీ పర్యటనలు మినహా ఆయన వస్త్రధారణలో ఎలాంటి మార్పు కనిపించదు. అయితే మొన్న ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లిన సందర్భంగా ఆయన తన స్టయిల్ ను మార్చేశారు. ఫ్రాన్స్ లో స్మార్ట్ సిటీలపై జరిగిన సదస్సుకు ఆయన సూటు బూటుతో వెళ్లారు. సూటులో వెంకయ్య రూపం ఆకట్టుకుంది. ఫ్రాన్స్ పర్యటనను ముగించుకుని తిరిగి వచ్చిన ఆయనలో బాగానే మార్పు వచ్చినట్లుంది. ఎందుకంటే, నేటి ఉదయం ఢిల్లీలో మొదలైన స్మార్ట్ సిటీల సదస్సుకు ఆయన సూటు బూటులోనే వచ్చారు. అంటే, ఇకపై మనం వెంకయ్యను తరచూ సూటు బూటులో చూడొచ్చన్నమాట. సూటు బూటు వస్త్రధారణలో టై కూడా కట్టుకోవడం మనకు తెలిసిందే. అయితే వెంకయ్యనాయుడు మాత్రం సూటు బూటు వేసినా, టై మాత్రం కట్టుకోలేదు. ఇది కూడా ఆయనను ప్రత్యేకంగా కనిపించేలా చేసిందనే చెప్పాలి.