: టీఆర్ఎస్ నేతల్లో గుబులు... మరికాసేపట్లో టీఆర్ఎస్ఎల్పీ కీలక భేటీ
టీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం మరికాసేపట్లో మొదలు కానుంది. తెలంగాణ సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్ లో జరగనున్న ఈ భేటీ నిన్నటి నుంచి ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల్లోనే కాక మంత్రుల్లోనూ తీవ్ర భయాందోళనలు రేపుతోంది. టీఎస్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నిన్నటితో ముగిశాయి. ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా విపక్షాలన్నీ ఈ సమావేశాల్లో ఏకం అయ్యాయి. కలసికట్టుగా ప్రభుత్వంపై విరుచుకుపడ్డాయి. అయితే, తాను సభలో ఉన్న సమయంలో సభాకార్యక్రమాలు సజావుగా సాగాయని... తాను సభలో లేని సమయంలోనే ప్రభుత్వంపై విపక్షాలు ముప్పేట దాడి చేశాయిని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో, అసలు సమస్య ఎక్కడుంది? అనే దానిపై కేసీఆర్ పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. అన్ని పార్టీల సభ్యులను సస్పెండ్ చేసిన తర్వాత కానీ, సభను నడిపించలేని పరిస్థితిపై ఆయన తనదైన శైలిలో విశ్లేషణ జరిపారని సమాచారం. ఏ మంత్రి సత్తా ఎంత? ఏయే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సత్తా ఎంత? అనే దానిపై కేసీఆర్ నివేదికలు సిద్ధం చేశారట. వీటిపై చర్చే ప్రధానంగా నేటి టీఆర్ఎస్ఎల్పీ భేటీ జరుగుతుందట. దీంతోనే ఆ పార్టీ నేతలంతా ఎక్కడ తమ అంశం ప్రస్తావనకు వస్తుందోనన్న భయంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే పలువురు మంత్రులను కేసీఆర్ నిలదీశారట. ఒకరిద్దరికి తలంటారు కూడా.