: లాబీల్లో ఎమ్మెల్యేల ముచ్చట్లు... తల పట్టుకున్న మంత్రి హరీశ్
నిన్నటి తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సొంత పార్టీ ఎమ్మెల్యేల తీరుతో టీఆర్ఎస్ సీనియర్ నేత, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు తల పట్టుకున్నారట. అసలు విషయమేంటంటే... రైతుల రుణమాఫీకి సింగిల్ సెటిల్ మెంట్ వర్తింపజేయాలన్న డిమాండ్ తో ఒక్క గొంతుకతో నిరసన వ్యక్తం చేసిన విపక్షాలన్నింటినీ ప్రభుత్వం సభ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో, విపక్ష సభ్యుల సీట్లన్నీ ఖాళీ అయిపోయాయి. కనీసం అధికార పక్షానికి చెందిన సీట్లైనా నిండితే సభ కొద్దిమేరకైనా నిండినట్లు కనిపిస్తుంది. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయపై చర్చ జరుగుతోంది. ఇంతటి కీలక సమయంలో స్వపక్ష సభ్యులకు చెందిన సీట్లు కూడా ఖాళీగా కనిపించాయి. దీనిని గమనించిన హరీశ్ రావు, అసలు ఎమ్మెల్యేలంతా ఎక్కడికెళ్లారంటూ ఆరా తీశారు. చర్చకు డుమ్మా కొట్టి లాబీలకు చేరిన ఎమ్మెల్యేలు ముచ్చట్లాడుకుంటున్నారని తెలిసిన ఆయనకు ఏం చేయాలో పాలుపోలేదు. కొద్దిసేపు వేచి చూసిన ఆయన ఆ తర్వాత ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ను ఎమ్మెల్యేల వద్దకు పంపారు. హరీశ్ ఆగ్రహం తెలిసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆ తర్వాత లాబీల్లో ముచ్చట్లకు వీడ్కోలు పలికి సభ లోపలికి వెళ్లారట.