: కమోడిటీ, రియల్టీల మద్దతుతో మార్కెట్లు ఆరు వారాల గరిష్ఠానికి!
భారత స్టాక్ మార్కెట్ పరుగు కొనసాగింది. కమోడిటీ రంగంలోని కంపెనీల ఈక్విటీలతో పాటు నిర్మాణ రంగ కంపెనీలు లాభాల్లో నడవడంతో భారత స్టాక్ మార్కెట్ ఆరు వారాల గరిష్ఠస్థాయికి చేరుకుంది. ప్రపంచ చమురు మార్కెట్లో క్రూడాయిల్ ధరలు రికవరీ దిశగా సాగుతుండటం కూడా ఇన్వెస్టర్ల సెంటిమెంటును పెంచిందని నిపుణులు వ్యాఖ్యానించారు. సెషన్ ఆరంభంలో క్రితం ముగింపుతో పోలిస్తే 50 పాయింట్ల నష్టంలో ఉన్న సెన్సెక్స్, ఒడిదుడుకుల మధ్య సాగుతూ లాభాల్లోకి వచ్చింది. బుధవారం నాటి సెషన్ ముగిసేసరికి బీఎస్ఈ సెన్సెక్స్ 102.97 పాయింట్లు పెరిగి 0.38 శాతం లాభంతో 27,035.85 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ సూచిక 24.50 పాయింట్లు పెరిగి 0.30 శాతం లాభంతో 8,177.40 పాయింట్ల వద్దకు చేరాయి. మంగళవారం నాటి సెషన్లో రూ. 98,93,996 కోట్లుగా ఉన్న మార్కెట్ కాప్, రూ. 99,30,391 కోట్లకు పెరిగింది. బీఎస్ఈలో మిడ్ క్యాప్ 0.09 శాతం, స్మాల్ క్యాప్ 0.40 శాతం లాభపడ్డాయి. ఎన్ఎస్ఈ-50లో హిందాల్కో, వీఈడీఎల్, కెయిర్న్ ఇండియా, ఓఎన్జీసీ, టాటా స్టీల్ తదితర కంపెనీల ఈక్విటీలు లాభపడగా, హెచ్సీఎల్ టెక్, విప్రో, టీసీఎస్, భారతీ ఎయిర్ టెల్, యాక్సిస్ బ్యాంక్ తదితర కంపెనీల ఈక్విటీలు నష్టపోయాయి.