: ఇక రంగంలోకి సీబీఐ... ఇంద్రాణి ముఖర్జియాను విచారించనున్న కేంద్ర దర్యాప్తు సంస్థ
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన షీనా బోరా హత్య కేసు దర్యాప్తులోకి కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ కూడా దిగేసింది. కోర్టు అనుమతితో ఈ కేసులో ప్రధాన నిందితురాలు, హత్యకు గురైన షీనా బోరా కన్నతల్లి ఇంద్రాణి ముఖర్జియాతో పాటు మరో ఇద్దరు వ్యక్తులను సీబీఐ అధికారులు విచారించనున్నారు. నేడు ప్రారంభం కానున్న సీబీఐ విచారణ ఈ నెల 19 దాకా కొనసాగనుంది. ఇప్పటికే ఈ కేసు దర్యాప్తును ముంబై పోలీసులు దాదాపు పూర్తి చేశారు. అయితే ఈ కేసును వెలికితీసిన ముంబై పోలీసు కమిషనర్ రాకేశ్ మారియా ఆకస్మిక బదిలీ నేపథ్యంలో విచారణ చివరి దశలో ఆగిపోయింది. మారియా స్థానంలో కొత్త కమిషనర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత కేసు దర్యాప్తు అనుకున్నంత వేగంగా సాగడం లేదు. ఈ నేపథ్యంలో ఈ కేసులో ప్రధాన నిందితులను విచారించేందుకు సీబీఐకి అనుమతి లభించడం ప్రాధాన్యం సంతరించుకుంది.