: టీనేజర్లకు ఇంటర్ నెట్ ముప్పు... ఎక్కువ బ్రౌజింగ్ తో ప్రమాదమేనంటున్న అధ్యయనం
ఇంటర్ నెట్ వినియోగంలో టీనేజర్లకు పొంచి ఉన్న ముప్పుపై న్యూయార్కుకు చెందిన ఓ అధ్యయనం హెచ్చరిస్తోంది. నెట్ అధికంగా వినియోగించే టీనేజర్లలో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని తెలిపింది. అది కూడా వారంలో 14 గంటలకు మించి నెట్ వాడే పిల్లలలో స్థూలకాయం, బీపీ వంటి సమస్యలు వస్తున్నాయని చెప్పింది. ఇక వారానికి 25 గంటలకు మించి ఇంటర్ నెట్ ఉపయోగిస్తే వారి ఆరోగ్యం మరింతెక్కువగా దెబ్బతింటుందని హెన్రీఫోర్డ్ ఆసుపత్రి వైద్యుడు ఆండ్రియా కాస్సిడి తెలిపారు. వారి అధ్యయనంలో భాగంగా నెట్ బ్రౌజింగ్ చేసే 335 మంది టీనేజర్లను పరీక్షించగా పైవిషయాలు తెలిసినట్టు చెప్పారు. 50 ప్రశ్నలకు పైగా ఉన్న ప్రశ్నాపత్రాన్ని వారికిచ్చి పరీక్షించగా... ఆ సమయంలో వారి బీపీ లెవల్స్ స్థాయి బ్యాలెన్స్ తప్పిందని తెలుసుకున్నారట. వారిలో 26 మందికి టీనేజీలోపే బీపీ వచ్చినట్టు గుర్తించామని, బ్రౌజింగ్ ఎక్కువ చేసే వారిలో 43 శాతం మంది అధిక బరువున్నారని వివరించారు. అయితే పిల్లల ఇంటర్ నెట్ వినియోగంపై తల్లిదండ్రులు పరిమితులు విధించాలని ఈ అధ్యయనం చేసినవారు చెబుతున్నారు. వీలైనంతవరకు నెట్ వినియోగానికి పిల్లలు దూరంగా ఉంచాలని ఆండ్రియా సూచించారు.