: ఇక 'హార్ట్ బైపాస్' ఉండనే ఉండదు!
సమీప భవిష్యత్తులో గుండెను తెరిచి చేసే శస్త్రచికిత్స (బైపాస్ సర్జరీ)లకు గుడ్ బై చెప్పవచ్చు. ఈ దిశగా బోస్టన్ చిల్డ్రన్స్ హాస్పిటల్, హార్వర్డ్ యూనివర్సిటీలో భాగంగా ఉన్న విస్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ బయొలాజికల్లీ ఇన్ స్పైర్డ్ ఇంజినీరింగ్, బ్రిఘామ్ లోని కార్ప్ ల్యాబ్ అండ్ ఉమెన్స్ హాస్పిటల్ సంస్థలకు చెందిన పరిశోధకులు ప్రత్యేక కాథెటర్ ద్వారా ఐదు నిమిషాల్లో చికిత్స పూర్తి చేసి చూపారు. వారు చేసిన పరిశోధనల్లో భాగంగా జంతువుల గుండెల్లోని రంద్రాలకు కాథెటర్ ను వినియోగించి విజయవంతమయ్యారు. బైపాస్ సర్జరీ జోలికి పోకుండా, గుండె రంధ్రాలకు అతుకు వేయటం కోసం అల్ట్రా వయొలెట్ లైటింగ్ టెక్నాలజీని వాడారు. ఇందులో భాగంగా, మెడ లేదా, తొడ లోని ఏదైనా ఒక నరం ద్వారా గుండెలో రంధ్రం ఉన్న ప్రాంతానికి ఈ కాథెటర్ సాయంతో మాసికను పంపుతారు. గుండెలో రంధ్రం పడ్డ ప్రాంతానికి చేరగానే కాథెటర్ రంధ్రం మధ్య నిలుస్తుంది. ఇదే సమయంలో దీనికి ఇరువైపులా అమర్చిన బుడగలు తెరచుకుని ఒకటి గుండె లోపలి వైపునకు, మరొకటి బయటి వైపునకు విచ్చుకుని మాసికను కదలకుండా చేస్తాయి. ఆ సమయంలో కాథెటర్ లోని అల్ట్రా వయెలెట్ కాంతి మాసిక అతుక్కునేందుకు సహాయపడుతుంది. మాసిక సక్రమంగా అతుక్కుందని తెలుసుకున్న తరువాత, రెండు బుడగలనూ ఆపి కేథటర్ ను వెనక్కు తీసుకువస్తారు. సమయం గడిచేకొద్దీ ఈ అతుకు వద్ద గుండె కణజాలం పెరిగి రంధ్రం దానికదే మూసుకుపోతుంది. ఈ విధానం వల్ల ఓపెన్ హార్ట్ సర్జరీ అవసరం ఇక ఎంతమాత్రమూ ఉండదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.