: మోదీ... దీనికి సమాధానం చెప్పాలి!: ముస్లింల ఆందోళన
ప్రధాని నరేంద్ర మోదీపై మరోసారి ముస్లింలు ప్రశ్నలు సంధిస్తున్నారు. గుజరాత్ అల్లర్ల నేపథ్యంలో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీపై ముస్లింలు మొత్తం ఆగ్రహావేశాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా దేశంలో గోమాంసం పెను వివాదం రేపుతోంది. బీజేపీ అధికారంలోకి వచ్చిన అనంతరం గోమాంసం పేరిట ఇతర మతస్థులపై దాడులకు దిగుతున్న సంఘటనలు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఉత్తరప్రదేశ్ లోని దాద్రి గ్రామంలో గోమాంసం తిన్నాడనే ఆరోపణతో ఓ వ్యక్తిని ఇంట్లోంచి లాక్కొచ్చి దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసింది. దీనిపై కేంద్రానికి రాష్ట్రం సమర్పించిన నివేదికలో, నిషేధిత జంతు మాసం తిన్నారన్న అనుమానంతో అతని కుటుంబంపై దాడి చేసినట్టు, ఇది ప్రమాదవశాత్తు సంభవించిన ఘటనగా పేర్కొన్నారు. అనంతరం పోలీసుల దర్యాప్తులో పక్కా ప్లాన్ ప్రకారం బీజేపీ నేత కుమారుడు, అతని వర్గంతో చేసిన దాడిగా నిరూపణ అయిన సంగతి తెలిసిందే. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ముస్లింలు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళనకు దిగారు. మోదీ నోరు విప్పాలని నినదించారు. ఇంత దారుణమైన హత్యను ప్రమాదం అని ఎలా అంటున్నారని నిలదీశారు. భారత్ ను సిలికాన్ వ్యాలీగా చేయడం కరెక్టో, లేక మతాన్ని వ్యాప్తి చేసే దేశంగా మిగల్చడం కరెక్టో ప్రధాని చెప్పాలంటూ వారు డిమాండ్ చేశారు. దీనిపై ప్రధాని నోరు విప్పాలని వారు స్పష్టం చేశారు.