: అగ్రిగోల్డ్ కేసు విచారణ మధ్యాహ్నం 2.15 నిమిషాలకు వాయిదా
అగ్రిగోల్డ్ సంస్థ కేసుపై హైకోర్టులో విచారణ ఈ మధ్యాహ్నం 2.15 నిమిషాలకు వాయిదాపడింది. అంతకుముందు జరిగిన విచారణకు అగ్రిగోల్డ్ ఛైర్మన్ వెంకట్రామయ్య, నలుగురు డైరెక్టర్లు, ఏపీ సీఐడీ చీఫ్ ద్వారకా తిరుమలరావు, ఇతర అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా విజయవాడ, బెంగళూరులోని అగ్రిగోల్డ్ స్థిరాస్తుల విలువపై కోర్టు ఆరా తీసింది. ఆస్తులు విక్రయిస్తే బెంగళూరులో 172 ఎకరాలకు రూ.1500 కోట్లు, విజయవాడలో 177 ఎకరాలకు రూ.1300 కోట్లు వస్తాయని అగ్రి తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ వాదనలను ఏకీభవించని న్యాయస్థానం, ఆస్తుల విలువను ఎక్కువ చేసి చూపి తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడింది. రెండు చోట్ల ఉన్న ఆస్తులు అమ్మితే రూ.200 కోట్లు మించి రాదని కోర్టు పేర్కొంది. తమను తప్పుదోవ పట్టించాలని చూస్తే సహించమని వ్యాఖ్యానించింది. 'నివేదించిన ఆస్తులు కాకుండా ఇతర ఆస్తులు లేవని ప్రమాణపత్రం ఇవ్వగలరా?' అంటూ ఈ సందర్భంగా ధర్మాసనం అగ్రిగోల్డ్ ను ప్రశ్నించింది. బినామీ పేర్లతో ఆస్తులు లేవని ప్రమాణపత్రం ఇవ్వగలరా? అని కూడా అడిగింది. ఇతర ఆస్తులున్నాయని తేలితే తీవ్ర పరిణామాలుంటాయని కోర్టు హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అగ్రిగోల్డ్ ఛైర్మన్, డైరెక్టర్ల ఆస్తుల విలువపై ప్రమాణ పత్రాలు దాఖలు చేయాలని ఆదేశించింది. అనంతరం విచారణను వాయిదా వేస్తున్నట్టు తెలిపింది. మొత్తంమీద ఆస్తుల విక్రయంపై కోర్టు మధ్యాహ్నం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.