: మోదీ ఇలాకాలో రణరంగం... మూతపడ్డ విద్యాలయాలు, కొనసాగుతున్న ఉద్రిక్తత
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సొంత నియోజకవర్గం వారణాసిలో నిన్న చోటుచేసుకున్న రణరంగం నేపథ్యంలో నేడు ఏకంగా విద్యాలయాలు మూతపడ్డాయి. గత నెల 22న గణేశ్ నిమజ్జనం సందర్భంగా గణేశ్ మండపాల నిర్వాహకులపై పోలీసులు లాఠీచార్జీకి పాల్పడ్డ సంగతి తెలిసిందే. గంగానదిలో గణేశ్ విగ్రహాల నిమజ్జనాన్ని అడ్డుకున్న సందర్భంగా నాడు ఘర్షణ తలెత్తింది. నాటి ఘటనపై నిన్న హిందూత్వ వాదులు చేపట్టిన నిరసన ప్రదర్శన చిలికిచిలికి గాలివానలా మారింది. పోలీసులపైకి ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. పదుల సంఖ్యలో పోలీసు, ప్రభుత్వ వాహనాలకు నిప్పు పెట్టారు. ఈ క్రమంలో పరిస్థితి చేయిదాటిపోకుండా పోలీసులు కర్ఫ్యూ విధించారు. నిన్నటి కర్ఫ్యూను సడలించినా, నేడు పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే ఉంది. ఈ నేపథ్యంలో నగరంలోని విద్యాలయాలన్నీ మూతపడ్డాయి. ఎటు నుంచి ఘర్షణ మొదలవుతుందోనన్న ఆందోళనలో వారణాసి వాసులు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.