: ‘జెంటిల్మన్’ గేమ్ పరువు తీసిన అభిమానులు ...కటక్ పిచ్ పైకి వాటర్ బాటిళ్లు విసిరిన వైనం
నిన్న కటక్ లో టీమిండియా, సఫారీ జట్ల మధ్య జరిగిన టీ20 మ్యాచ్ లో భారత్ కు ఫ్రీడమ్ సిరీస్ (టీ20) టైటిల్ మాత్రమే చేజారలేదు. జెంటిల్మన్ క్రికెట్ పరువు ప్రతిష్ఠలు కూడా గంగలో కలిశాయి. పేలవ ప్రదర్శనలో టీమిండియా టైటిల్ ను చేజార్చుకుంటే, దానిని జీర్ణించుకోలేకపోయిన భారత క్రికెట్ అభిమానులు కట్టుతప్పి భారత పరువును మంటగలిపారు. తమ జట్టు పేలవ ప్రదర్శనపై ఆగ్రహం వ్యక్తం చేసిన క్రికెట్ ఫ్యాన్స్ స్టేడియం స్టాండ్స్ నుంచి వాటర్ బాటిళ్లను పిచ్ పైకి విసిరేశారు. పిచ్ నలుదిశల నుంచి వాటర్ బాటిళ్లు వచ్చిపడుతున్న నేపథ్యంలో మ్యాచ్ దాదాపు 40 నిమిషాల పాటు నిలిచిపోయింది. అప్పుడెప్పుడో 1996 వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా నమోదైన చేదు జ్ఞాపకాలను ఫ్యాన్స్ మరోసారి గుర్తు చేశారు. తమ జట్టు ఓడిపోవడం ఖాయమని తేలగానే ఒక్కసారిగా భారత ఫ్యాన్స్ కట్టుతప్పారు. క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా వాటర్ బాటిళ్లను పిచ్ పైకి విసిరేసి క్రికెటర్లను భయభ్రాంతులకు గురి చేశారు. చివరకు పోలీసులు రంగప్రవేశం చేసి 40 నిమిషాల తర్వాత మ్యాచ్ ను కొనసాగించేలా చేశారు.