: వరుసగా రెండో ఓటమి... టీ20 సిరీస్ కోల్పోయిన టీమిండియా
భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న ఫ్రీడమ్ సిరీస్ లో భాగంగా టీ20 టైటిల్ ను టీమిండియా చేజార్చుకుంది. మొన్న ధర్మశాలలో తొలి మ్యాచ్ చేజార్చుకున్న టీమిండియా నిన్న రాత్రి కటక్ వేదికగా జరిగిన రెండో టీ20లోనూ వరుసగా రెండో అపజయాన్ని మూటగట్టుకుంది. దీంతో మూడు మ్యాచ్ ల సిరీస్ లో రెండింటిలో విజయం సాధించిన సఫారీలు టీ20 టైటిల్ ను ఇంకో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకున్నారు. తొలి మ్యాచ్ లో మాదిరిగానే నిన్నటి కటక్ మ్యాచ్ లోనూ టాస్ గెలిచిన సఫారీ కెప్టెన్ డూప్లెసిస్ ఫీల్డింగ్ ఎంచుకుని టీమిండియాను బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. ఆదిలోనే బ్యాటింగ్ లో తడబడ్డ టీమిండియా వరుసగా వికెట్లు కోల్పోయింది. సఫారీ బౌలర్లు అల్బీ మోర్కెల్, మోరిస్, ఇమ్రాన్ తాహిర్ ల బౌలింగ్ కు టీమిండియా బ్యాట్స్ మెన్ బెంబేలెత్తిపోయారు. కేవలం 17.2 ఓవర్లలో 92 పరుగులకే ఆలౌటయ్యారు. భారత స్టైలిష్ బ్యాట్స్ మన్ రోహిత్ శర్మతో పాటు వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీలిద్దరూ రనౌట్ కావడం జట్టు కొంప ముంచింది. ఆ తర్వాత 93 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన సఫారీలు 17.1 ఓవర్లలోనే నాలుగు వికెట్ల నష్టానికి 96 పరుగులు చేసి విజయం సాధించింది. రెండో మ్యాచ్ లోనూ సఫారీ ఆల్ రౌండర్ జేపీ డుమిని (30 నాటౌట్) సత్తా చాటాడు.