: పొగతాగేవాళ్లకు పళ్లు తొందరగా ఊడిపోతాయట!
సాధారణంగా వయస్సు పైబడుతున్నప్పుడు పళ్లు ఊడిపోతుండటం చూస్తుంటాం. కానీ, పొగ తాగే అలవాటుండే వారిలో కొంతముందుగానే పళ్లు ఊడిపోతాయన్న విషయం తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఇంగ్లాండు లోని బర్మింగ్ హామ్ కు చెందిన పరిశోధకులు ఈ అధ్యయనం చేశారు. పొగ తాగేవారు, పొగ తాగని వారిని ఎంచుకుని పరిశోధన నిర్వహించారు. వివిధ వయస్సులకు చెందిన సుమారు 24 వేల మందిపై జరిగిన పరిశోధనలో వెల్లడైన విషయాలు... పొగ తాగని వారి కంటే తాగే వారిలో పళ్లు ఊడిపోయే అవకాశాలు 3.6 రెట్లు అధికంగా ఉన్నాయి. అదే పొగతాగే స్త్రీలలో అయితే రెండున్నర రెట్లు ఎక్కువగా ఉంటుంది. పళ్లు ఊడిపోవడమే కాకుండా చిగుళ్ల సమస్యలు, వ్యాధులు కూడా తలెత్తుతాయి. చిన్నతనం నుంచే పొగతాగే అలవాటు కనుక ఉంటే, పళ్లు ఊడిపోవడం కూడా త్వరగానే మొదలవుతుంది. ధూమపానం అలవాటు కారణంగా ప్రతి ఏటా 30 శాతం మంది జనాభా తమ పళ్లను కోల్పోతున్నారు. పొగతాగే అలవాటున్న వారి పళ్లు 64-70 సంవత్సరాల మధ్యలో ఊడిపోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.