: ఎందుకంత ఓవరాక్షన్?: ప్రభుత్వాధికారిని కడిగేసిన మంత్రి గంటా
సింహాచలం దేవస్థాన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రామచంద్ర మోహన్ పై ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు సీరియస్ అయ్యారు. ఫోన్ చేసి చెడామడా కడిగేశారు. వివరాల్లోకి వెళితే, సింహాచలం పరిధిలోని 21 ఎకరాల జిరాయితీ భూములు తమవేనని దేవస్థానం ఇటీవల బోర్డులు పాతింది. దీనిపై గ్రామస్థులకు, ఆలయ సిబ్బందికీ మధ్య గొడవలు కూడా జరిగాయి. ఇది అన్యాయమంటూ తిరగబడ్డ ప్రజలు ఈఓ పెట్టించిన బోర్డులను పీకేశారు. దీంతో ఆగ్రహించిన మోహన్ వారిపై పోలీసు కేసులు పెట్టించారు. దీంతో వారంతా మంత్రి గంటా వద్దకు వచ్చి మొరపెట్టుకోగా, స్వయంగా తన ఫోన్ నుంచి మోహన్ కు కాల్ చేసిన గంటా ఆయన్ను ఏకేశారు. "ఎందుకంత కంగారు? నాకు అర్థం కావడం లేదు. వాళ్లు ఊరుమొత్తం ఇప్పుడు నా దగ్గరకు వచ్చి కూర్చుని ఉన్నారు. అంత కంగారేంటి? గవర్నమెంటు ఒక నిర్ణయం తీసుకుంటుంది కదా. ఈలోపు నువ్వే హడావుడి చేయాల్సిన అవసరం ఏంటక్కడ? తరువాత... ఊళ్లో అడ్డుపడ్డ వాళ్లపైన కేసులు పెడతారా? క్రిమినల్ కేసులు... అర్జంటుగా బోర్డులు పెట్టాల్సిన అవసరం ఏంటి? బోర్డులు పెట్టగానే ప్లాటు మీకు హ్యాండోవర్ అయిపోద్దా? ఇప్పుడు మీరేమీ ఓవరాక్షన్ చేసి ఇంకేమీ చర్యలు తీసుకోవద్దు. నేను మాట్లాడతాను. బోర్డులు పెట్టడం, పీకేయడం, మళ్లీ కేసులు పెట్టడం... ఇదంతా... అవసరమేంటి? ఓ పక్క ప్రభుత్వం మాట్లాడుతోంది. నెగోషియేట్ చేస్తోంది. ఈలోగా మీ కంగారేంటి? పొజిషన్ తీసుకోలేని నువ్వు బోర్డులెందుకు పెట్టించావు? దాని వల్ల లాభమేంటి. ఏమీ వద్దు... మీరేమీ ఎక్స్ ట్రాలు చేయవద్దు. ముందు ఆ కేసులు తీసేయండి. మొత్తం పది మందిపై కేసులు పెట్టారంట. ఈ కేసులు పెట్టేదేంటి?... (ఈ సమయంలో ఈఓ ఏదో సమాధానం చెప్పేందుకు ప్రయత్నించారు) దౌర్జన్యమా..? కాదు... అది కాదయ్యా... ఇప్పుడు ఆ పొజిషన్లో మీరుంటే దౌర్జన్యం చేయరా? అక్కడ మీరుంటే మీకు తెలిసేది ఏమయ్యేదో... ఎందుకు పీస్ డిస్ట్రబ్ చేస్తారిప్పుడు? ఓపక్క మాట్లాడుతున్నాం. మొన్ననే ఇష్యూ సెటిల్ అయ్యింది. తరువాత ఏం చేయాలో, ఎలాంటి చర్యలు తీసుకోవాలో మాట్లాడుతున్నాం. ఈలోపే బోర్డులు పెట్టేస్తే సెటిలైపోద్దా? ల్యాండ్ నీకు వస్తదా? రాదుకదా..? నేను మళ్లీ చెబుతాను, మాట్లాడుతా... మీరేమీ ఇంటర్ ఫియర్ కాకండి... సరేనా?" అని పెట్టేశారు.