: బెంగళూరు బస్సు కోసం ప్రయాణికుల జాగారం... ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యం నిర్వాకం!
నిన్న రాత్రి 10 గంటలకు దాదాపు 45 మంది బ్యాగులతో హైదరాబాదు, మెహిదీపట్నంలోని పిల్లర్ నెంబర్:52 వద్దకు వచ్చారు. బెంగళూరు వెళ్లేందుకంటూ వచ్చిన వారు ఎంతకీ అక్కడి నుంచి కదలలేదు. గంటా, రెండు గంటలు... ఏకంగా తెల్లవారింది. అయినా వారంతా అక్కడే ఉన్నారు. రాత్రంతా కంటిమీద కునుకు లేకుండా అక్కడే పడిగాపులు కాశారు. మరి వారు టికెట్లు కొనలేదా? అంటే, ఆన్ లైన్ లో క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేశారు. అయితే వారు కొనుగోలు చేసింది ఆర్టీసీ బస్సు టిక్కెట్లు కాదులెండి. ప్రైవేట్ టూర్ ఆపరేటర్ ఆదిత్యా ట్రావెల్స్ కు చెందిన బస్సు టికెట్లను వారు కొనుగోలు చేశారట. ఏదో కారణంతో బస్సును రద్దు చేసిన సదరు ట్రావెల్స్ యాజమాన్యం సదరు సమాచారాన్ని టికెట్లు కొన్న ప్రయాణికులకు చేరవేయడంలో మాత్రం ఆసక్తి చూపలేదు. దీంతో బ్యాగులతో పాటు వచ్చేసిన 45 మంది పిల్లర్ నెంబర్:52 వద్దే రాత్రంతా జాగారం చేశారు.