: రష్యా రాకుంటే మధ్య ప్రాచ్యమంతా నాశనమేనంటున్న సిరియా అధినేత
సిరియాలో జరుగుతున్న ఉగ్రవాదుల మారణహోమం, పౌరయుద్ధాలను అణచి వేసేందుకు రష్యా ముందడుగు వేయకుంటే మధ్య ప్రాచ్య ప్రాంతమంతా నాశనమయ్యే ప్రమాదంలో పడేదని ఆ దేశ అధ్యక్షుడు బషర్ అల్-అసద్ వ్యాఖ్యానించారు. రష్యా మిలటరీ వచ్చి తమతో కలసి దాడులు జరపడం స్వాగతించదగ్గ పరిణామమని ఇరాన్ అధికార టెలివిజన్ చానల్ లో మాట్లాడుతూ ఆయన అన్నారు. రష్యా, సిరియా, ఇరాక్, ఇరాన్ ల కూటమి ఈ యుద్ధంలో తప్పనిసరిగా గెలవాలని, అలా జరగకుంటే మొత్తం ప్రాంతమంతా ధ్వంసమైనట్టేనని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా, గత బుధవారం నాడు సిరియాలో బాంబుదాడులు జరిపిన రష్యా వాయుసేన భారీ ఎత్తున నష్టాన్ని కలిగించిన సంగతి తెలిసిందే. తమ కూటమి విజయం సాధించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని, ఇది తప్పనిసరని బషర్ వ్యాఖ్యానించారు. ఇదిలావుండగా, సిరియా, దాని మిత్రదేశాలు జరుపుతున్న దాడులకు భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వుంటుందని ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు సామాజిక మాధ్యమాల్లో పోస్టర్లను ఉంచారు.