: ఆ వివాదం పెద్దది కాకుండా రాజీ చేశాం: కుంబ్లే
గతంలో ఆస్ట్రేలియా క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్, భారత క్రికెటర్ హర్భజన్ సింగ్ ల మధ్య చోటుచేసుకున్న వివాదం గురించి టీమిండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే ప్రస్తావించారు. ఆ వివాదాన్ని నాటి ఆస్ట్రేలియా కెప్టెన్ రికీ పాంటింగ్ తో కలిసి తాను సద్దుమణిగేలా చేశానని చెప్పారు. 2008 ఆసీస్ పర్యటనలో భాగంగా రెండో టెస్టులో సైమండ్స్- హర్భజన్ మధ్య చోటు చేసుకున్న మాటల యుద్ధం ఒక రేంజ్ కు చేరింది. మంకీ గేట్ వివాదంగా నాడు హాట్ టాపిక్కయింది. దీనిపై కుంబ్లే మాట్లాడుతూ, 'ఆ సమయంలో సౌరవ్ గంగూలి, సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ లు హర్భజన్ కు అండగా ఉన్నారు. మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఆకస్మికంగా జరిగే ఘటనలపై కెప్టెన్ చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. క్రికెట్ జట్టు కెప్టెన్లకు పరిణతితో కూడిన దూకుడు మాత్రమే ఉండాలన్నది నా అభిప్రాయం' అన్నారు కుంబ్లే.