: చేసిన మేలు మరచిన కృతఘ్నుడు కమల్ హాసన్: శరత్ కుమార్ సంచలన ఆరోపణ
తమిళనాట నడిగర సంఘం ఎన్నికలు జరగనున్న వేళ, నటీనటుల మధ్య ఆరోపణలు మరింతగా పెరిగాయి. ఈ నెల 18న ఎన్నికలు జరగనుండగా, విశాల్ జట్టు, శరత్ కుమార్ జట్టు పోటీ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో నటుడు కమల్ హాసన్ పై శరత్ కుమార్ తీవ్ర విమర్శలు చేశారు. చేసిన మేలును మరచిన కృతఘ్నుడని దుయ్యబట్టారు. ఆయన నటించిన 'విశ్వరూపం' విడుదల సమయంలో సమస్యలు వస్తే, తాను దగ్గరుండి సాయం చేశానని గుర్తు చేసిన ఆయన, 'ఉత్తమ విలన్' విడుదల సమయంలో తన భార్య రాధిక ఆయనకు ఎంతో అండగా నిలిచిందని తెలిపారు. తనకు తమిళనాట 'నడిగర సంఘం' నుంచి ఎలాంటి సాయమూ అందలేదని కమల్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. తమతో పోటీలో ఉన్న జట్టుకు మద్దతిచ్చేలా కమల్ మాట్లాడారని, ఇది కృతజ్ఞతా హీనమని అన్నారు. కాగా, ఇటీవల ఓ ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ నిర్వహించిన సర్వేలో విశాల్ జట్టు 64 శాతం ఓట్లతో విజయం సాధించవచ్చని వెల్లడి కావడం గమనార్హం.