: జంట నగరాలకు 'పసుపు'కళ...తెలుగు తమ్ముళ్లకు పండగ వేళ!
జంట నగరాలు పసుపు వర్ణంతో శోభిస్తున్నాయి. ఈ ఉదయం టీడీపీ జాతీయ, తెలుగు రాష్ట్రాల కమిటీలు ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో నగరంలోని అన్ని ప్రధాన ప్రాంతాలను స్వాగత తోరణాలు, ప్లెక్సీలు, తెలుగుదేశం జెండాలతో అలంకరించారు. గత రాత్రంతా వర్షం పడుతుండగా, ఏ మాత్రమూ ఉత్సాహం తగ్గని తెలుగు తమ్ముళ్లు నగరాన్ని పసుపుమయం చేశారు. శంషాబాద్ విమానాశ్రయం, నాంపల్లి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ల నుంచి బంజారాహిల్స్ లోని టీడీపీ కార్యాలయం వరకూ రోడ్ల వెంబడి చంద్రబాబునాయుడు, యువనేత లోకేష్ చిత్రాలతో పాటు ముఖ్య నేతలు, ప్రమాణ స్వీకారం చేస్తున్న నేతల చిత్రాలున్న ప్లెక్సీలు అందంగా కనిపిస్తున్నాయి. కాగా, ఈ ఉదయం 9:30 గంటలకు కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారం జరుగనుండగా, కేంద్ర కమిటీ అధ్యక్షుడిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నారా లోకేష్ బాధ్యతలు స్వీకరించనున్న సంగతి తెలిసిందే.