: మీడియాపై ఆసక్తికర కామెంట్లు చేసిన సల్మాన్ ఖాన్
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ మీడియాపై ఆసక్తికర కామెంట్లు చేశారు. తాను హీరోగా నటించిన 'ప్రేమ్ రతన్ ధన్ పాయో' సినిమాతో పాటు, తాను వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న'బిగ్ బాస్ 9' కార్యక్రమం ప్రమోషన్లలో ప్రస్తుతం సల్మాన్ చాలా బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో, పలు మీడియా సమావేశాల్లో ఆయన పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా తాను తీసుకుంటున్న రెమ్యునరేషన్ విషయంపై మీడియా ప్రతినిధులకు ఆయన తనదైన శైలిలో జవాబిచ్చారు. "మీరు తీసుకుంటున్న జీతాల విషయంపై నాకు ఆసక్తి లేదు... మరి, నా జీతం విషయంపై మీకు ఎందుకంత ఆసక్తి? నేను తీసుకునే రెమ్యునరేషన్ పెరిగినా, అది బీయింగ్ హ్యూమన్ ఫౌండేషన్ కే వెళుతుంది" అని చెప్పారు. 2007లో కొన్ని సంస్థలతో కలసి బీయింగ్ హ్యూమన్ ఫౌండేషన్ ను సల్మాన్ స్థాపించారు. ఆర్థిక సమస్యల్లో ఉన్న ఎంతో మందికి విద్య, వైద్య సేవలను ఈ ఫౌండేషన్ ద్వారా అందిస్తున్నారు.