: 62 బంతుల్లో రోహిత్ సెంచరీ
మహాత్మా గాంధీ-నెల్సన్ మండేలా ద్వైపాక్షిక సిరీస్ లో భాగంగా ధర్మశాలలో ప్రారంభమైన టీట్వంటీ మ్యాచ్ లో రోహిత్ శర్మ శివాలెత్తాడు. ఆదిలోనే శిఖర్ ధావన్ (3) రనౌట్ గా వెనుదిరగడంతో రోహిత్ జాగ్రత్తగా ఆడాడు. కోహ్లీ (42) అండతో రోహిత్ శివాలెత్తాడు. సాధికారికమైన ఆటతీరుతో అద్భుతమైన టైమింగ్ తో బంతిని బౌండరీ దాటించడం మొదలు పెట్టాడు. మొదట్లో కేవలం ఫోర్లు కొట్టేందుకు ఆసక్తి చూపిన రోహిత్, ఓవర్లు గడుస్తున్న కొద్దీ ఫీల్డింగ్ గ్యాప్ లను చక్కగా వినియోగించుకున్నాడు. గ్రౌండ్ నలుమూలలా బంతిని పరుగులు పెట్టిస్తూ కేవలం 62 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. ఈ సెంచరీలో 12 ఫోర్లు, 5 సిక్స్ లు ఉండడం విశేషం. రోహిత్ సెంచరీ సాధించిన కాసేపటికే అబాట్ బౌలింగ్ లో భారీ షాట్ కు యత్నించిన విరాట్ (43) డుమినికి దొరికిపోగా, మరో రెండు బంతులు మాత్రమే ఆడిన రోహిత్ శర్మ (106) అబాట్ సంధించిన బంతిని మోరిస్ కు క్యాచ్ ఇచ్చి రోహిత్ పెవిలియన్ చేరాడు. 16 ఓవర్లు ఆడిన భారత్ 3 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. దీంతో ధోనీ, రైనా క్రీజులోకి వచ్చారు.