: తమిళ విపక్షాలపై సెటైర్లేసిన కరుణానిధి
తమిళనాడు విపక్ష పార్టీలపై ప్రధాన ప్రతిపక్ష నేత, డీఎంకే అధినేత కరుణానిధి సెటైర్లు వేశారు. ప్రతిపక్షాల తీరు హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. ప్రతివాళ్లు తదుపరి సీఎం తానే అన్నట్టు వ్యవహరిస్తూ, ఊహాలోకంలో విహరిస్తున్నారంటూ మండిపడ్డారు. ప్రతిపక్షాలు ఐక్యంగా లేకపోవడం వల్లే అధికార పార్టీ ఆటలు సాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో అధ్వాన పాలన సాగుతోందని, ఈ ప్రభుత్వం వల్ల ప్రజలకు ఒరిగిందేమీ లేదని ఆయన అభిప్రాయపడ్డారు. మంత్రులు దోపిడీ లక్ష్యంగా ఉంటే, అధికారులు నిర్లక్ష్యంతో ఉన్నారని, ప్రజా సమస్యలు పట్టించుకునేవారే కరవయ్యారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికార బలం, ప్రతిపక్షాల అనైక్యతతో ప్రజలు అష్టకష్టాలు పడతున్నారని ఆయన అన్నారు. ప్రజలు మేల్కోవాల్సిన సమయం ఆసన్నమైందని, ఎవరు మంచి చేశారో గుర్తెరగాలని, రాష్ట్ర ప్రయోజనాలు, అభివృద్ధిని ప్రాతిపదికగా తీసుకుని ఎవరికి అధికారం అప్పగించాలో ప్రజలే నిర్ణయించుకోవాలని ఆయన సూచించారు.