: బాపట్ల ఏజీ కళాశాల నిరవధిక మూసివేత: విద్యార్థుల ఆందోళన
గత రెండు రోజులుగా విద్యార్థులు సమ్మె చేస్తున్న కారణంగా బాపట్ల వ్యవసాయ కళాశాల, వసతి గృహాలను నిరవధికంగా మూసివేశారు. ఈ మేరకు ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆదేశాలు జారీ చేసింది. కళాశాలలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. అసోసియేట్ డీన్ పీఆర్ కే ప్రసాద్ ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ నిర్ణయంపై విద్యార్థులు మండిపడ్డారు. అకస్మాత్తుగా కళాశాల, వసతి గృహాలను మూసివేసి తమను బయటకు పంపడం సబబు కాదన్నారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ఆమరణ నిరాహాద దీక్షకు దిగుతామని విద్యార్థులు హెచ్చరించారు. కాగా, వారం క్రితం కళాశాల విద్యార్థి మద్దుకూరి సూర్యారావు ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి కళాశాల సహాయ ఆచార్యుడి వేధింపులే కారణమని విద్యార్థుల ఆరోపణ. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సంఘటనపై విశ్వవిద్యాలయం నియమించిన ఉన్నత స్థాయి కమిటీ ఒకటి విచారణ చేపట్టింది. ఆ నివేదికను, కమిటీలో సభ్యులను తమకు చూపాలన్న విద్యార్థుల డిమాండ్ ను వర్శిటీ అధికారులు ఒప్పుకోలేదు. విశ్వవిద్యాలయ వీసీ, రిజిస్ట్రార్ లకు సీల్డ్ కవర్ లో పంపుతామని చెప్పారు. నివేదిక చూపించాలని పట్టుబట్టిన విద్యార్థులు రెండు రోజులుగా సమ్మె చేస్తున్నారు.