: తోక లాంటి ఎమ్మెల్యే పదవిని త్వరలోనే కట్ చేసుకుంటా...వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఝలక్కిచ్చేందుకు ఆయన పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే సిద్ధమవుతున్నారు. అది కూడా తన సొంత జిల్లాకు చెందిన నేత నుంచి ఇలాంటి ముప్పు ఉండటం జగన్ కు నిజంగానే షాక్ తగిలేలానే ఉంది. కడప జిల్లా జమ్మలమడుగు ఎమ్మెల్యేగా కొనసాగుతున్న వైసీపీ సీనియర్ నేత ఆదినారాయణరెడ్డి నిన్న తన నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన ముద్రా యోజన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ఎమ్మెల్యే పదవి ఓ తోక లాంటిది. దానిని త్వరలోనే తొలగించుకుంటా. దసరా దాకా ఆగండి. తోకలాంటి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కార్యకర్తలు, నాయకులు, విలేకరులకే కాకుండా, ఏడుపులు, పెడబొబ్బలు పెట్టిన వారికి తగ్గట్టుగా నా నిర్ణయాన్ని చెబుతా’’ అని ఆయన వ్యాఖ్యానించారు. గతంలోనూ వైసీపీని ఆదినారాయణ రెడ్డి వీడనున్నారన్న పుకార్లు షికారు చేశాయి. అయితే వాటినన్నిటికి తెరదించిన ఆయన ఇంకా వైసీపీలోనే కొనసాగుతున్నారు. తాజా వ్యాఖ్యలతో ఆదినారాయణ రెడ్డి వైసీపీ శిబిరంలో మరోమారు కలకలం రేపారు. మరి ఆయనను నిలువరించేందుకు జగన్ ఏం చేస్తారో చూడాలి.