: ఆ హత్యల గురించి ఎవరో చెప్పడమెందుకు?...మేమే పుస్తకం రాస్తున్నాం: ఆరుషి తల్లిదండ్రులు
దేశంలో సంచలనం సృష్టించిన ఆరుషి తల్వార్, పనిమనిషి హేమరాజ్ హత్య కేసులో వాస్తవాలు వివరిస్తూ ఓ పుస్తకం రాస్తున్నామని తీహార్ జైలులో నిందితులుగా శిక్ష అనుభవిస్తున్న ఆరుషి తల్లిదండ్రులు రాజేష్ తల్వార్, నుపుర్ తల్వార్ తెలిపారు. ఈ హత్యా కేసుపై 'ఆరుషి' పేరుతో త్వరలో సినిమా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో వారు మాట్లాడుతూ, ఆ సినిమా ట్రైలర్ ను చూశామని, రెండు వైపులా ఆలోచించి సినిమా తీసినట్టు అనిపిస్తోందని, అదే సమయంలో దుర్బుద్ధితో సీబీఐ విచారణాంశాల వైపు వెళ్లలేదని భావిస్తున్నామని అన్నారు. ఎవరు ఏది చెప్పినా ఈ కేసులో నిజానిజాలు ప్రపంచానికి తెలియజేసేందుకు, దానిపై పుస్తకం రాస్తున్నామని తెలిపారు. పుస్తకం రాస్తుండగా కలిగిన దుఃఖంతో మధ్యలో ఆపేశామని, త్వరలో దానిని పూర్తి చేస్తామని వారు వివరించారు. కూతురు పోయిన బాధలో ఉండగా, ముద్దాయిలను చేసి కేసులో ఇరికించారని వారు వాపోయారు. తాజా ఘటనలతో దేవుడిపై నమ్మకం పోయిందని, కానీ ఏదయినా నిజాన్ని నిరూపించేందుకు ఓపిక, నమ్మకం అవసరమన్న సాయిబాబా మాటలు మాత్రం నమ్ముతామని వారు తెలిపారు.