: విద్యార్థికి ‘హెయిర్’ కట్... పాఠశాల చర్యలపై తల్లిదండ్రుల నిరసన
విద్యార్థి తల జుట్టు పొడవుగా ఉందంటూ అతనిని తరగతి గదిలో నుంచి బయటకు తీసుకువచ్చి జుట్టు కట్ చేసిన సంఘటనపై తల్లిదండ్రులు మండి పడుతున్నారు. విద్యార్థిని మానసిక క్షోభకు గురిచేయడం సబబు కాదంటూ చైల్ట్ ప్రొటెక్షన్ రైట్స్ ను ఆశ్రయించారు. ఈ సంఘటన దక్షిణ ముంబైలోని యాక్టివిటీ హై స్కూల్ లో చోటుచేసుకుంది. బాధిత విద్యార్థి ఈ స్కూల్ లో పదో తరగతి చదువుతున్నాడు. ఈ సంఘటనతో అవమానంగా ఫీలైన ఆ విద్యార్థి పాఠశాలకు వెళ్లేందుకు మొండికేయడంతో ఈ విషయం బయటపడింది. బాధిత విద్యార్థి తల్లి మాట్లాడుతూ, పాఠశాల యాజమాన్యం తమ కొడుకు హెయిర్ కట్ కు అని చెప్పి రూ. 150 తీసుకున్నారు. క్రాఫ్ సరిగా చేయలేదంటూ తరగతి గదిలో ఉన్న తమ కొడుకుని బయటకు పిలిచి జుట్టు కత్తిరించుకురావాలంటూ మళ్లీ పంపారు. అందుకోసం మరో రూ.150 అడిగారు. అందుకు పిల్లవాడు ఒప్పుకోకపోవడంతో అవమానకర రీతిలో పాఠశాల యాజమాన్యం దండించిందని ఆమె వాపోయింది. ఈ విషయమై పాఠశాల ప్రిన్సిపాల్ ను ప్రశ్నించగా ఇటువంటి సంఘటనలేవీ పాఠశాల ఆవరణలో జరగలేదని చెప్పారు. యూనిఫాం కోడ్ లో భాగంగా విద్యార్థుల హెయిర్ కట్ కూడా ఉంటుందన్నారు. ఈ పనికి సెలూన్ నుంచి నిపుణుడినే పిలిపిస్తామని చెప్పారు. ఈ సంఘటన గురించిన వివరాలు క్లాసు టీచర్ ను అడిగి తెలుసుకుంటానని ప్రిన్సిపాల్ చెప్పారు. ఈ సంఘటన విషయమై ముంబై విద్యా విభాగానికి చెందిన ఓ ఉన్నతాధికారిని అడుగగా, తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదన్నారు. ఒకవేళ ఈ సంఘటన నిజమైతే కనుక విచారణ నిమిత్తం అధ్యయన కమిటీని ఏర్పాటు చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు.