: పాక్ ఆక్రమిత కాశ్మీరులో తిరుగుబాటు తీవ్రతరం... భారత్ లో కలిపేయండి అంటూ ఆందోళనలు
కాశ్మీర్ లోని ఓ వర్గానికి చెందిన కొందరు అల్లరిమూకలు తమకు స్వాతంత్ర్యం ఇవ్వాలని అప్పుడప్పుడు ఆందోళనలు చేస్తుండటం చూస్తూనే ఉంటాం. ఈ సందర్భంగా పాకిస్థాన్, ఐఎస్ఐఎస్ జెండాలను కూడా వారు ప్రదర్శిస్తుంటారు. అయితే, దీనికి ఎన్నో రెట్లు ఎక్కువగా పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే)లో ఆందోళనలు ఎగసిపడుతున్నాయి. పాక్ ప్రభుత్వంపై అక్కడి ప్రజలు ఏకంగా తిరుగుబాటు జెండాను ఎగురవేశారు. 'మీ పాలన మాకు వద్దు... ఈ దుర్భర జీవితం గడపలేం... స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు కావాలి, మాకు విముక్తి కల్పించండి... భారత్ లో కలిపేయండి' అంటూ పీవోకేలోని ప్రజలు ర్యాలీలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. పీవోకేలోని గిల్గిత్, కోట్లి, ముజఫరాబాద్ తో పాటు పలుప్రాంతాల్లో ఆందోళనలు క్రమేణా పెరుగుతున్నాయి. వేలాది మంది ప్రజలు ఈ ఆందోళన కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారు. అంతర్జాతీయ వేదికలపై ఎప్పుడూ కాశ్మీరీల హక్కులు అంటూ రాద్ధాంతం చేసే పాక్ ప్రభుత్వానికి ఈ తిరుగుబాటు ఆందోళనను కలిగిస్తోంది. అంతర్జాతీయ సమాజం దృష్టిని ఈ ఆందోళనలు ఆకర్షించకముందే అణచివేయాలని భావిస్తోంది. ఈ క్రమంలో నిరసనకారులపై ఉక్కుపాదం మోపుతోంది. ఈ నేపథ్యంలో, పాక్ ఆక్రమిత కాశ్మీర్ యుద్ధభూమిని తలపిస్తోంది. పాక్ ప్రభుత్వం భారీ ఎత్తున మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోంది. మరో ముఖ్య విషయం ఏమిటంటే, ఐక్యరాజ్యసమితిలో పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ప్రసంగిస్తూ... కాశ్మీరుపై చర్చలు లేకుండా, శాంతి ప్రక్రియ ఉండదని చెబుతున్న సమయంలో... పీవోకేలో ఆందోళనలు మరింత తీవ్రతరమయ్యాయి. ప్రపంచదేశాల ముందు పాకిస్థాన్ ను దోషిగా నిలబెట్టే దిశగా ఈ తిరుగుబాటు కొనసాగుతోంది. పాక్ పాలనలో తమ జీవితం దుర్భరంగా మారిందని, తమకు విముక్తి కావాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. తమపై బలప్రయోగం చేసే హక్కు పాకిస్థాన్ కు లేదని... ఈ దేశం కంటే పొరుగున ఉన్న భారతే తమకు ఎన్నో రెట్లు మేలని వారు చెబుతున్నారు. మరో విషయం ఏమిటంటే... పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు జెండా ఎగురవేసిన ఆందోళనకారులకు... మాజీ ఉగ్రవాది హషీమ్ ఖురేషీ మద్దతు తెలుపుతున్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ముందుకు వెళుతున్న భారత్ పై ఆయన ప్రశంసల జల్లు కురిపించారు. పాక్ సైన్యం చర్యలను ఖురేషీ ఎండగట్టారు. ఏదేమైనప్పటికీ, ప్రస్తుత తిరుగుబాటు పాక్ పాలకులు, సైన్యం గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది.