: ఇక ఏకగ్రీవమే... శశాంక్ మనోహర్ కు మద్దతు పలికిన రాజీవ్ శుక్లా
బీసీసీఐ పగ్గాలు చేపట్టడానికి శశాంక్ మనోహర్ కు అన్ని మార్గాలు క్లియర్ అయ్యాయి. పోటీదారుగా భావించిన ఐపీఎల్ ఛైర్మన్ రాజీవ్ శుక్లా కూడా, తాను బీసీసీఐ అధ్యక్ష పదవి రేసులో లేనని స్పష్టం చేశారు. శశాంక్ కు పూర్తి మద్దతు తెలుపుతున్నానని చెప్పారు. దీంతో, శశాంక్ మనోహర్ రెండోసారి బీసీసీఐ పీఠంపై కూర్చోవడానికి రంగం సిద్ధమైంది. శరద్ పవార్, అనురాగ్ ఠాకూర్ వర్గాలకు కూడా ఆమోదయోగ్యుడిగా ఉండటం... శశాంక్ కు కలసివచ్చింది. రాజీవ్ శుక్లా అధ్యక్ష పదవికి పోటీ పడవచ్చని తొలుత కొంతమంది భావించారు. అయితే, తాను రేసులో లేనని శుక్లా స్పష్టం చేయడంతో... ఎన్నిక ఏకగ్రీవం కానుంది. మరోవైపు, శశాంక్ నాయకత్వంలో బీసీసీఐ పనితీరు మరింత మెరుగుపడుతుందని తాను భావిస్తున్నట్టు శుక్లా తెలిపారు. తానెప్పుడూ బోర్డుకు విధేయుడిగానే ఉంటానని చెప్పారు.