: స్కూలు పిల్లలనూ వదల్లేదు!... చలో అసెంబ్లీపై టీ పోలీస్ ఉక్కుపాదం
వరంగల్ జిల్లా మొద్దుగుట్ట ఎన్ కౌంటర్ ను నిరసిస్తూ 400 ప్రజా సంఘాలు నిన్న జరపతలపెట్టిన ‘చలో అసెంబ్లీ’పై తెలంగాణ సర్కారు ఉక్కుపాదమే మోపింది. చలో అసెంబ్లీలో భాగంగా ఎక్కడ అసెంబ్లీని ముట్టడిస్తారోనన్న అనుమానంతో మంగళవారం రాత్రి నుంచే రంగంలోకి దిగిన పోలీసులు పెద్ద సంఖ్యలో ప్రజా సంఘాల నేతలను అదుపులోకి తీసుకున్నారు. ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య తదితరులను గృహ నిర్బంధంలో ఉంచిన పోలీసులు, ఉద్యమాల గడ్డ ఉస్మానియా యూనవర్సిటీ హాస్టళ్లలోనూ పెద్ద ఎత్తున తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో పాఠశాలకు వెళుతున్న 8వ తరగతి విద్యార్థులను కూడా నిన్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాదులోని బాగ్ లింగంపల్లిలో నిన్న ఉదయం నడిరోడ్లపై పెద్ద ఎత్తున వాహన తనిఖీలు చేపట్టిన పోలీసులు స్కూల్ బస్సులో పాఠశాలకు వెళుతున్న 8వ తరగతి విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఫొటోలను ఓ తెలుగు దినపత్రిక నేటి తన సంచికలో ప్రముఖంగా ప్రచురించింది.