: లాలూ 'జంగిల్ రాజ్'...నితీష్ వెన్నుపోటుదారు: అమిత్ షా
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ పై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. లాలూను జంగిల్ రాజ్ గా అభివర్ణించగా, నితీష్ కుమార్ ను వెన్నుపోటుదారుగా పేర్కొన్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నితీష్ బీజేపీ కార్యకర్తలను అవమానించినా, బీహార్ ను జంగిల్ రాజ్ నుంచి కాపాడేందుకు అప్పుడు నితీష్ కు అధికారం కట్టబెట్టామని అన్నారు. ఇప్పుడు అధికారం కోసం అదే నితీష్ బీజేపీకి వెన్నుపోటు పొడిచి, జంగిల్ రాజ్ తో పొత్తుపెట్టుకున్నాడని మండిపడ్డారు. లాలూ రిజర్వేషన్ల విషయంలో వివాదం రేపేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. బీజేపీ దళితుల, వెనుకబడిన కులాల రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదని అన్నారు. బీజేపీపై వ్యతిరేకత తెచ్చేందుకు లాలూ ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. వెనుకబడిన కులాల రిజర్వేషన్లకు బీజేపీ మద్దతిస్తుందని ఆయన స్పష్టం చేశారు.