: స్మార్ట్ సిటీపై జీహెచ్ఎంసీ ప్రత్యేక వెబ్ సైట్
స్మార్ట్ సిటీపై ప్రత్యేక వెబ్ సైట్ ను ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. 'జీహెచ్ఎంసీ మై గవర్నమెంట్' పేరిట త్వరలో ఈ వెబ్ పేజీ అందుబాటులోకి వస్తుందని కమిషనర్ సోమేష్ కుమార్ తెలిపారు. దేశవ్యాప్తంగా వంద నగరాలు పోటీ పడుతున్న నేపథ్యంలో మొదటి విడతగా 20 సిటీలను కేంద్రం ఎంపిక చేయనుంది. దానికి ఎంపికైన సంవత్సరం నుంచి ఏటా రూ.100 కోట్లు కేంద్రం మంజూరు చేస్తుంది. ఈ తొలి విడత సిటీల్లో చోటు దక్కించుకునేందుకు ప్రతిపాదిత ప్రణాళికల రూపకల్పనకు జీహెచ్ఎంసీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇందుకోసం ప్రజాభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సూచించింది. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక వెబ్ సైట్ ను ఏర్పాటు చేయనున్నట్టు కమిషనర్ వెల్లడించారు. సైట్ ద్వారా స్మార్ట్ సిటీ ఎలా ఉండాలి, మౌలిక వసతుల కల్పన, చారిత్రక సంపద పరిరక్షణకు చేపట్టాల్సిన చర్యలు తదితర అంశాలపై ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తారు. నవంబర్ 25లోగా స్మార్ట్ సిటీ ప్రాజెక్టు నివేదికను కేంద్రానికి పంపుతామని చెప్పారు.