: వరవరరావు కూడా అరెస్ట్... అసెంబ్లీ ముందు భారీ సంఖ్యలో బలగాల మోహరింపు
వరంగల్ జిల్లా మొద్దుగుట్ట ఎన్ కౌంటర్ కు నిరసనగా 400 ప్రజా సంఘాలు నిర్వహించతలపెట్టిన ‘చలో అసెంబ్లీ’ హైదరాబాదులో ఉద్రిక్త పరిస్థితులకు తెర తీసింది. ప్రజా సంఘాల ఆందోళనను తిప్పికొట్టేందుకు నిన్న రాత్రి నుంచే రంగంలోకి దిగిన పోలీసులు ప్రజా సంఘాల నేతలను పెద్ద సంఖ్యలో ముందస్తుగా అరెస్ట్ చేశారు. ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్యను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అయితే నేటి తెల్లవారుజామున తనను అరెస్ట్ చేసేందుకు వచ్చిన పోలీసులకు వరవరరావు ఝలకిచ్చారు. పోలీసులు తన ఇంటివద్దకు చేరుకునేలోగానే వరవరరావు బయటకు వెళ్లిపోయారు. అయితే ఆయన కోసం ముమ్మర గాలింపు చేపట్టిన పోలీసులు ఎట్టకేలకు ఆయనను కొద్దిసేపటి క్రితం అదుపులోకి తీసుకున్నారు. నగరాన్ని జల్లెడ పట్టిన పోలీసులకు వరవరరావు ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద దొరికిపోయారు. ఈ సందర్భంగా అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. మరోవైపు అసెంబ్లీ వద్ద పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలు మోహరించాయి.