: పేటీఎంకు పెట్టుబడుల వరద... వాటా తీసుకున్న ‘అలీబాబా’
ఈ-కామర్స్ చెల్లింపుల వేదిక ‘పేటీఎం’కు పెట్టుబడులు పోటెత్తుతున్నాయి. నోయిడా కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఈ సంస్థలో భారత పారిశ్రామిక దిగ్గజం టాటా సన్స్ చైర్మన్ ఎమెరిటస్ రతన్ టాటా వ్యక్తిగత హోదాలో పెట్టుబడి పెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా పేటీఎంకు విదేశాల నుంచి కూడా పెట్టుబడులు వచ్చిపడ్డాయి. చైనా ఈ-కామర్స్ దిగ్గజం ‘అలీబాబా’ పేటీఎంలో వాటా తీసుకుంది. అలాగే, యాంట్ ఫైనాన్సియల్ గ్రూప్’ కూడా కొంత మేర వాటా తీసుకుంది. అయితే పేటీఎంలో వాటా కొనుగోలు కోసం ఎంతమేర పెట్టుబడి పెట్టామన్న విషయాన్ని ఆ రెండు సంస్థలు వెల్లడించలేదు. ఈ సందర్భంగా అలీబాబా చీఫ్ డేనియల్ జంగ్ మాట్లాడుతూ భారత ఈ-కామర్స్ రంగానికి ఉజ్వల భవిష్యత్తు ఉందని వ్యాఖ్యానించారు. తాజాగా అందిన నిధులతో కార్యకలాపాల విస్తరణ, మార్కెటింగ్, మొబైల్ కామర్స్, పేమెంట్ ఎకోసిస్టమ్స్ తదితరాలను అభివృద్ధి చేయనున్నట్లు పేటీఎం వెల్లడించింది.