: చలో విజయవాడ బాటలో... ఏపీ సీఎం పేషీ!


ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు బాటలోనే ఆయన కార్యాలయం (ఏపీ సీఎంఓ) నడుస్తోంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో గుంటూరు జిల్లా తుళ్లూరు పరిసరాల్లో ‘అమరావతి’ పేరిట నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో రాజధాని నిర్మాణం పూర్తయ్యే దాకా అమరావతి సమీపం నుంచే కార్యకలాపాలు చక్కబెట్టుకోవాలని నిర్ణయించుకున్న చంద్రబాబు విజయవాడలో తన క్యాంపు కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. నాలుగైదు నెలలుగా ఎక్కువ సమయం ఆయన అక్కడే గడుపుతున్నారు. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు కూడా ఇటీవలే సీఎం క్యాంపు కార్యాలయంలోనే ప్రత్యేకంగా గదిని ఏర్పాటు చేసుకున్నారు. ఇక మనమెందుకు హైదరాబాదు నుంచి పనిచేయాలనుకున్నారో, ఏమో గానీ సీఎం పేషీ అధికారులు కూడా ఒక్కొక్కరుగా విజయవాడ బాట పడుతున్నారు. సీఎం పేషీ ముఖ్య కార్యదర్శి సతీశ్ చంద్ర ఇప్పటికే తన మకాంను విజయవాడకు షిప్ట్ చేశారు. సీఎం పేషీ ఓఎస్డీగా నియమితులైన కృష్ణమోహన్ ఇటీవలే సమాచార, పౌర సంబంధాల కమిషనర్ గా నియమితులయ్యారు. అయినప్పటికీ ఆయన కూడా తన కార్యాలయాన్ని విజయవాడలో ఏర్పాటు చేసుకున్నారు. తాజాగా సీఎం పేషీ జాయింట్ సెక్రటరీ ప్రద్యుమ్న కూడా తన కార్యాలయాన్ని విజయవాడకు తరలించేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ మేరకు నిన్న ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.

  • Loading...

More Telugu News