: పోలీసు కమిషనర్ వేధిస్తున్నాడని ఫిర్యాదు చేసిన మహిళా ఐపీఎస్
ఓ అత్యాచారం కేసు విషయంలో నిందితులపై తప్పుడు ఆరోపణలు మోపిన పై అధికారి గురించి తెలుసుకున్న తనపై వేధింపులు పెరిగిపోయాయని గుర్గావ్ జాయింట్ ట్రాఫిక్ పోలీస్ కమిషనర్ భారతీ అరోరా ఆరోపించారు. నగర పోలీసు కమిషనర్ నవదీప్ సింగ్ తన వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ, మానసికంగా హింసిస్తున్నారని ఆరోపిస్తూ, హర్యానా డీజీపీ యశ్ పాల్ సింఘాల్ కు లేఖ రాశారు. నవదీప్ సింగ్ కావాలని ఓ పోలీసు అధికారి కుమారుడిని అత్యాచారం కేసులో నిందితుడిగా చేర్చారని, కేసు దర్యాప్తు చేసిన తాను ఈ విషయాన్ని గమనించి అభ్యంతరం వ్యక్తం చేయగా, అప్పటి నుంచి వేధింపులు మొదలయ్యాయని, ఆయన వల్ల తన కెరీర్ ప్రమాదంలో పడిందని వాపోయారు. కాగా, ఈ కేసులో తనపై భారతీ చేస్తున్న ఆరోపణలను నవదీప్ ఖండించారు. ఈ కేసులో నిందితుడిని కాపాడేందుకు ఆమె ప్రయత్నిస్తున్నారని ప్రత్యారోపణలు చేశారు. గుర్గావ్ మాజీ డిప్యూటీ పోలీస్ కమిషనర్ భరద్వాజ్ కుమారుడు అజయ్ ని గత సంవత్సరం అత్యాచారం కేసులో అదుపులోకి తీసుకున్నారు. అజయ్ మాజీ జీవిత భాగస్వామి ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది.