: ఆ ముగ్గురు యువకులు... అన్నదాతలు!
హోటళ్లలో, ఇళ్లలో మిగిలిపోయిన లేదా ఎక్కువైన ఆహారాన్ని తమకివ్వమంటూ విజ్ఞప్తి చేస్తూ... అలా సేకరించిన ఆహారాన్ని చెన్నై వీధుల్లో ఆకలితో అలమటించే వారికి ప్రేమతో వడ్డిస్తున్న ఆ ముగ్గురు యువకులు గురించి తెలుసుకుందాం. ఆసీఫ్, నరేశ్వర్ శివనేశన్, ఫద్ ఖలీల్ ముగ్గురు మిత్రులు. ఆ ముగ్గురు సాఫ్ట్ వేర్ మాజీ ప్రొఫెషనల్స్. వీధుల్లో ఆకలిబాధలు పడేవారికి అన్నం పెట్టాలనే ఉద్దేశ్యంతో ‘గివ్ అవే’ అనే ఒక స్వచ్ఛంద సంస్థను ఈ ముగ్గురు ప్రారంభించారు. ఈ క్రమంలో ఈ ముగ్గురు కలిసి ఒక కొత్త మొబైల్ యాప్ ను తయారు చేస్తున్నారు. పదిహేను రోజుల్లో ఈ యాప్ ను ప్రారంభించనున్నట్లు ఆసీఫ్ చెప్పారు. ప్రస్తుతం వాట్సప్ లో ఒక గ్రూపును ఏర్పాటు చేసి ఎక్కువైన లేదా ఎక్స్ ట్రా ఆహారం కనుక ఉంటే తమకు సమాచారం అందించాలంటూ చెన్నై ప్రజలను రిక్వెస్ట్ చేస్తున్నారు. సమాచారం అందిన వెంటనే ‘గివ్ అవే’ వలంటీర్లు అక్కడికి వెళ్లి ఆహారాన్ని కలెక్టు చేసుకుని, ఆకలితో ఉన్న వారికి దానిని పెడతారు. 'గత మూడు వారాలలో కనీసం 1000 మంది హోమ్ లెస్ పీపుల్ కు అన్నం పెట్టాం. రోజుకు 10,000 మంది అన్నార్తులకు అన్నం పెట్టాలన్నదే మా లక్ష్యం' అని వారు అంటున్నారు. అసలు ఈ స్వచ్ఛంద సంస్థను ఎందుకు ఏర్పాటు చేయాల్సివచ్చిందనే దానిపై యూపీఎస్సీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ఆసీఫ్ మాట్లాడుతూ..‘నాకు పదమూడేళ్ల వయస్సు ఉన్నప్పుడు మా సొంత ఊరిలో ఉన్న ఒక రెస్టారెంట్ కు వెళ్లాను. అక్కడ, నా వయస్సే ఉన్న ఒక పిల్లవాడు గిన్నెలు కడుగుతుండటం చూశాను. అతను ఈ పని ఎందుకు చేస్తున్నాడని ఆరా తీశాను. అనారోగ్యంగా ఉన్న తన తల్లికి ఆహారం కొనేందుకని తెలిసింది. దీంతో పాటు రెస్టారెంటు మూసేసే సమయానికి ఎంతో ఆహారాన్ని డస్ట్ బిన్ లో పారేస్తున్న సంఘటన నాతో పాటు నా మిత్రులను చాలా బాధపెట్టింది’ అని ఆసీఫ్ చెప్పాడు. అంతేకాకుండా, రంజాన్ రోజుల్లో చాలా మంది కనీసం ఒక్కపూట కూడా భోజనం చేసే పరిస్థితి లేనివారిని చూశాము. ఇట్లాంటి వారి కోసం ఏదైనా చేయాలనే గట్టి నిర్ణయం తీసుకున్నాము. దాని ఫలితమే ‘గివ్ అవే’ అని చెబుతున్నారు.