: పీవీ, మన్మోహన్ లను పొగడ్తలతో ముంచెత్తిన శివసేన
ఇండియాకు పెట్టుబడులను ఆహ్వానించడమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశ విదేశాలు చుడుతున్న వేళ, మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్ లను శివసేన పార్టీ పొగడ్తలతో ముంచెత్తింది. ఇండియాకు నేడు విదేశీ పెట్టుబడులు వస్తున్నాయంటే, వాటి వెనుక పీవీ, మన్మోహన్ సింగ్ ల కృషి ఎంతో ఉందని, దాన్ని మరువరాదని సొంత పత్రిక సామ్నాలో ఆ పార్టీ వెల్లడించింది. ఇతర దేశాల ఇన్వెస్ట్ మెంట్లకు గేట్లు తీసిందే వీరిద్దరి విదేశాంగ విధానాలేనని పత్రిక సంపాదకీయంలో అభిప్రాయపడింది. "మన్మోహన్ సింగ్ ఆలోచనలకు, తమ పార్టీ అభిప్రాయాలకు సారూప్యత లేకపోయినా, మన దేశానికి ఆయన తన అత్యుత్తమ సేవలను అందించారని మేము అంగీకరిస్తున్నాం" అని పేర్కొంది. 1982, ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా టెలివిజన్ ప్రసారాలు తొలిసారిగా కలర్ లో టెలికాస్ట్ అయ్యాయని, ఆపై రాజీవ్ గాంధీ హయాంలో కంప్యూటర్లు, ప్రతి గ్రామంలో ఎస్టీడీ బూత్ లు వెలిశాయని గుర్తు చేసుకుంది. భారత టెలికమ్యూనికేషన్ రంగానికి రాజీవ్ తో పాటు ఆయన సలహాదారు శామ్ పిట్రోడాలు రూపకర్తలని వెల్లడించింది.